బెంగాల్‌లో నడ్డా కాన్వాయ్‌పై దాడి

10 Dec, 2020 13:58 IST|Sakshi

కోల్‌కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారు.. రాళ్లు రువ్వారు. వివరాలు.. నడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్‌ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడమే కాక రోడ్డు బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఊరుకోక నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. నడ్డా వాహనం అక్కడ నుంచి వెళ్లే వరకు పహారా కాశారు.  ఇందుకు సంబంధించిన వీడియోని కైలాష్‌ విజయవర్గియా ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలువుతోంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ అద్దాలు పగలడం.. నిరసనకారులు విసిరిన రాళ్లు వాహనం లోపల పడటం వంటివి వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఆమె పేరే అసహనానికి పర్యాయపదం)

ఈ ఘటనపై బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ.. ‘డైమండ్‌ హర్బర్‌కు వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డాజీ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. టీఎంసీ నిజ స్వరూపం ఏంటో దీంతో బట్టబయలు అవుతోంది’ అన్నారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నాయకులు ఖండించారు. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి అనుమతించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు