సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు

18 Aug, 2021 10:24 IST|Sakshi

చరిత్ర సృష్టించనున్న బీవీ నాగరత్న

న్యూఢిల్లీ: "భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపేట్టే సమయం ఆసన్నమైంది" అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే అన్న వ్యాఖ్యలు నిజం అయ్యే సమయం ఆసన్నమయినట్లే ఉంది. అన్ని అనుకూలిస్తే.. త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027 లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్‌ జస్టిస్‌ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో బీవీ నాగరత్న పేరు కూడా ఉన్నది. 

ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్నం పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆమె 2008 లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అది దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక క్షణంగా నిలుస్తుంది.  నాగరత్న తండ్రి ఈఎస్‌ వెంకటరామయ్య గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 1989 నుంచి డిసెంబర్ 1989 మధ్య భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

భారతదేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీవీ నాగరత్నను ఆ పదవి వరిస్తే.. ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కూడా మహిళ.. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. గతంలో బాబ్డే "మహిళల ఆసక్తి, ఉత్సాహం మాకు తెలుసు. సాధ్యమైనంత మేర అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వైఖరిలో మార్పు రావాలి అనడానికేమీ లేదు. సమర్థులైన అభ్యర్ధులు కావాలి" అన్నారు.

జాబితాలో మరో ఇద్దరు మహిళలు..
ఐదుగురు సభ్యుల కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల జాబితాలో  నాగరత్నతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారు జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్ బేల త్రివేది (గుజరాత్). సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా కొలీజయం జాబితాలో ఉంది. నాగరత్న, పీఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్,జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ జాబితాలో ఉన్న ఇతరులు. 

న్యాయ వ్యవస్థలో మహిళలు..
భారతదేశంలో 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటినుంచి 47మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలిగా ఎపెక్స్ కోర్టులో 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 మంది. అయితే, ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జ్‌లుగా వ్యవహరించారు .

1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు జడ్జ్‌లలో కేవలం 73 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.

మరిన్ని వార్తలు