ఆయనో జంటిల్మన్‌ జడ్జి

13 May, 2023 05:55 IST|Sakshi
జస్టిస్‌ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

జస్టిస్‌ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ

న్యూఢిల్లీ: జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్‌ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్‌ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్‌ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అధ్యక్షత వహించారు.

‘అలహాబాద్‌ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్‌ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్‌. జస్టిస్‌ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్‌ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్‌ అనేది జస్టిస్‌ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు.

ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్‌ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్‌ సీనియర్‌ జడ్జిల్లో జస్టిస్‌ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్‌ మహేశ్వరి రిటైర్‌మెంట్‌తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది.  

‘ఈ–ఫైలింగ్‌  2.0’ ప్రారంభం
సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్‌ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్‌లైన్‌ ద్వారా ఫైల్‌ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేసులు ఫైల్‌ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు.

మరిన్ని వార్తలు