జైలుకెళ్లండి.. నేతలవుతారు..

4 Oct, 2021 04:24 IST|Sakshi

చండీగఢ్‌: జైలుకెళ్లి వస్తే నేతలవుతారంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ కిసాన్‌ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు నిరసనలు జరుగుతున్న చోట్లకు బీజేపీ కార్యకర్తలు 500, 700, 1,000 చొప్పున గుంపులుగా వెళ్లాలని అన్నారు. రైతుల ‘భాష’లోనే వారికి సమాధానం చెబుదాం అని చెబుతున్న వీడియో వైరల్‌ అయింది. అందులో ఆయన ఇంకా మాట్లాడుతూ. ఒక వేళ జైలుకెళ్లిన బాధపడవద్దని, జైలుకెళ్తే మహా అయితే నెలో, మూడు నెలలో ఉంటారని, కానీ ఆ తర్వాత పెద్ద నేతలవుతారని అన్నారు. చరిత్రలో పేర్లు నిలిచిపోతాయని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. రైతులపై దాడులు చేయాలంటూ రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. ఇలా చేయడానికి మోదీ–నడ్డాల అనుమతి తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేసింది. హింసను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెబుతుంటే ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) నేత అభయ్‌ సింగ్‌ చౌతాలా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి మీద దేశద్రోహం కింద కేసు పెట్టాలని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు