Kiren Rijiju: ‘అది పనిష్మెంట్‌ కాదు.. మోదీ విజన్‌’

19 May, 2023 15:24 IST|Sakshi

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం మార్పులపై ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కొత్త మంత్రిత్వశాఖ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ బదిలీ అనేది మోదీ ప్రభుత్వం తనకు విధించిన శిక్ష మాత్రం కాదని అన్నారు. ఇదొక ప్రణాళిక అని అన్నారు. ఈ చర్య ప్రధాని మోదీ విజన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ బదిలీ విషయమై తాను సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని నొక్కి చెప్పారు. అలాగే న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్నలను అస్సలు అడగవద్దని, ప్రస్తుతం ఆ శాఖ తనకు సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. అయినా మోదీ నాకు కొత్త బాధ్యతలు ఇస్తూనే ఉన్నందున తాను బాధ్యాతాయుతంగా పని చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇదిలా ఉండగా రవిశంకర్‌ ప్రసాద్‌ నిష్క్రమణ తర్వాత రిజిజు జూలై 7, 2021న న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి నియమకాల విషయమై సుప్రీం కోర్టు, ప్రభుత్వం వైఖరిపై తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి పరాయి అని ఘాటు వ్యాఖ్యలు చేయడమే గాక రిటైర్డ్‌ యాక్టివిస్ట్‌ జడ్జిల న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర షోషిస్తోందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు బేధాభిప్రాయాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్‌ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యాయవ్యవస్థలో ఎలాంటి జగడాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా కిరణ్‌ రిజిజును తప్పించినట్లు పలువురు భావిస్తున్నారు. 

(చదవండి: లేడీ సింగం మృతిపై అనుమానాలు.. రభా వెనక భాగంలో గాయాలు!)

మరిన్ని వార్తలు