వాళ్లంతా బుర్ర లేనోళ్లు..! 

14 Oct, 2020 07:11 IST|Sakshi

మానసిక ఎదుగుదల లేని  పార్టీ కాంగ్రెస్‌ 

బీజేపీలో చేరేందుకు సుందర్‌ కారణం కాదు– కుష్బు 

60 స్థానాలే లక్ష్యంగా బీజేపీ పావులు

సాక్షి, చెన్నై : మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ బీజేపీ మహిళా నేత, నటి కుష్బు ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి తన సేవలను వాడుకున్నప్పుడు తానో నటినని తెలియలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఘనస్వాగతం.. 
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన నటి కుష్బుకు చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌తో పాటు పలువురు నేతలు ఆమెను పూలమాలతో ముంచెత్తారు. అక్కడి నుంచి నేరుగా కమలాలయం చేరుకున్న కుష్బు మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకే నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ పార్టీని విమర్శించలేదని, ప్రస్తుతం అదే శైలిలో సాగాలని నిర్ణయించినా, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు వదలిపెట్టేలా లేరన్నారు. తనను విమర్శించ బట్టే, ఇప్పుడు పెదవి విప్పాల్సి వస్తోందన్నారు. విమర్శిస్తే, ఎదురు దాడికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తనను అణగదొక్కారని, అక్కడ బుర్ర తక్కువ నాయకులే ఎక్కువని, తనకు తెలివి ఉండబట్టే మేల్కొని బయటకు వచ్చేశానని వ్యాఖ్యానించారు. ఇది వరకు ప్రతి పక్షంలో ఉండబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. ఇప్పుడు తానో నటి అన్న విషయం కాంగ్రెస్‌ వాళ్లకు గుర్తొచ్చినట్టుందని మండిపడ్డారు. బీజేపీలో చేరడానికి తన భర్త సుందర్‌ కారణం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తాను ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు. 

బీజేపీకి పెరిగిన గ్లామర్‌ ఇమేజ్‌ 
కుష్బు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో సినీనటుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే నమిత, గౌతమి, గాయత్రి రఘురాం, మధువంతి, కుట్టి పద్మిని, నటుడు రాధారవి, సంగీత దర్శకులు గంగై అమరన్, దీనా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.  

60 స్థానాలే లక్ష్యం 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకే నుంచి ఆ సీట్లను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 17న ఆయన చెన్నైకు రానున్నారు. అన్నాడీఎంకే వర్గాలతో భేటీ, బీజేపీలో చేరిక కార్యక్రమాలు అంటూ ముందుకు సాగబోతున్నారు.  

మరిన్ని వార్తలు