లాలూకు బెయిల్‌.. అయినా జైలే

10 Oct, 2020 03:57 IST|Sakshi

రూ.2 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసిన జార్ఖండ్‌ హైకోర్టు

దుమ్కా ఖజానా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత

రాంచీ:  దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చింది. అవిభాజ్య బిహార్‌ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్‌డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది.

ఇప్పుడు బెయిల్‌ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి.  

ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం
లాలూప్రసాద్‌ యాదవ్‌ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు