రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం

10 Oct, 2020 03:42 IST|Sakshi
సుఖోయ్‌ నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యం

యాంటీ రేడియేషన్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం 

దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక మైలురాయి

బాలాసోర్‌:   భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్‌ క్షిపణి రుద్రం–1ను భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది.

సుఖోయ్‌–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్‌ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్‌ ఈ యాంటీ రేడియేషన్‌ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

రుద్రం ప్రత్యేకతలు
► దీన్ని  సుఖోయ్‌–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు.  
► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు.  
► 0.6 మాక్‌ నుంచి 2 మాక్‌ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు.  
► న్యూ జనరేషన్‌ యాంటీ రేడియేషన్‌ మిస్సైల్‌ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది
► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్‌ హోమింగ్‌ హెడ్‌ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది.   
► ఐఎన్‌ఎస్‌–జీపీఎస్‌ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది.  
► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్‌ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు.  
► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్‌ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్‌ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం.  

మరిన్ని వార్తలు