బీడీ ప్యాకెట్‌లపై ​​రొనాల్డో, మెస్సీ చిత్రాలు: వైరల్‌

14 Jul, 2021 16:05 IST|Sakshi

ఏదైనా ఓ వస్తువు మార్కెట్‌లో క్లిక్‌ కావాలంటే ముందుగా తట్టే ఆలోచన అడ్వర్టైజ్మెంట్.  తినే ఆహారం నుంచి మనిషికి వినోదాన్ని పంచే సినిమా వరకు ప్రకటన చాలా ఉపయోగపడుతుంది.  ఇక  సెలబ్రిటీలు బ్రాండ్అం‌బాసిడర్‌గా ఉండే కంపెనీలు కోట్లు పోగేసుకుంటాయి.  ఆ మధ్య కాలంలో క్రిస్టియానో ​​రొనాల్డో ప్రెస్‌ మీట్‌లో కోక్‌ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’  ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్‌ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారత ఐపీఎస్‌ అధికారి రూపీన్‌ శర్మ ‘‘ మెస్సీ ఫస్ట్‌ ఎండోర్స్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘మెస్సీ ఏజెంట్లు దీన్ని చూడరని, బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్‌ చేయరని ఆశిస్తున్నాను. ఇది బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌ అయి ఉండాలి.’’ అంటూ కామెంట్‌ చేశాడు. అయితే కేవలం మెస్సీ చిత్రంతో ఉన్న బీడీ ప్యాకెట్‌నే కాదు. పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో బీడీ ప్యాకెట్ల చిత్రాలను కూడా నెటిజన్లు పంచుకున్నారు.

మరిన్ని వార్తలు