మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ.. మంత్రులుగా 28 మంది ప్రమాణం

25 Dec, 2023 16:25 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సోమవారం కేబినెట్‌ను విస్తరించింది. సీఎం మోహన్‌ యాదవ్‌ తన తన మంత్రి వర్గంలోకి 28 మందిని తీసుకున్నారు. 28 మందితో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ సీ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్ పటేల్, బీజేపీ జాతీయ జనరల్‌ సెక్రటరీ  కైలాష్‌ విజయవర్గీయ, ప్రద్యుమన్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్‌ ఉన్నారు. 

వీరిలో 18 మంది కేబినెట్‌ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రి వర్గంలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 28 మంది మంత్రుల్లో 11 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయిదుగురు షెడ్యూల్‌ కులాలు(ఎస్సీ), ముగ్గురు షెడ్యూల్‌ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు ఉన్నారు. 

కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కాకుండా మరో నేత మోహన్‌ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది.

చదవండి: ‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’

>
మరిన్ని వార్తలు