భారత మాత విధవ కాదు.. స్త్రీకి బొట్టు ఉండాల్సిందే!: భిడేకు నోటీసులు

3 Nov, 2022 15:23 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ఉద్యమకారుడు, రైట్‌ వింగ్‌ నేత శంబాజీ భిడే.. మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ జర్నలిస్ట్‌ నుదుట బొట్టు లేని కారణంగా ఆమెతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన.. ఆపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

శంభాజీ భిడే బుధవారం సెక్రటేరియట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలిశారు. ఆపై బయటకు వచ్చిన భిడేను ఓ జర్నలిస్ట్‌ పలకరించే యత్నం చేశారు. అయితే ఆమె నుదుటపై బొట్టు లేని విషయం గమనించిన ఆయన మాట్లాడను అని తెగేసి చెప్పాడు. ‘‘నన్ను ప్రశ్నించే ముందు బిందీ (బొట్టు) ధరించాలని తెలియదా... నీతో మాట్లాడను. మహిళలు భారత మాతతో సమానం. భారత మాత ఏం విధవ కాదు. అందుకే భారత స్త్రీలు బిందీ లేకుండా విధవ రూపంలో కనిపించకూడద’’ని అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై సదరు జర్నలిస్ట్‌ రూపాలీ బీబీ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రూపాలి చఖ్నార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ  వ్యాఖ్యలపై వివరణనివ్వాలంటూ శంభాజీకి నోటీసులిచ్చారు. ఇంకోవైపు కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు ఆ పెద్దాయన తీరుపై మండిపడుతున్నారు. 

శంభాజీ ఇలా వివాదంలో చిక్కుకోవడం మొదటిసారేం కాదు. 2018లో.. తన తోటలోని మామిడి పండ్లను తిన్న దంపతులకు  మగపిల్లలు పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

మరిన్ని వార్తలు