Maharashtra: మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్‌

4 Jul, 2022 18:31 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ఏర్పడింది. నేడు(సోమవారం) సీఎం షిండే బల నిరూపణలో సైతం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. 

ఇదిలా ఉండగా.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే సోమవారం మహారాష్ట‍్ర ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా.. ఇంధన ధరలను తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించనున్నట్టు స్పష‍్టం చేశారు. దీనిపై కేబినెట్‌ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది నవంబర్‌లో, కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాయి.

ఇక, మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను మరింత తగ్గించాయి. అయితే, ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. కాగా, మహారాష్ట్రలో అప్పుడున్న ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌ వ్యాట్‌ను తగ్గించలేదు. తాజాగా ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించనున్నట్టు తెలిపింది. 

ఇది కూడా చదవండి: ఉద్ధవ్‌ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు

మరిన్ని వార్తలు