సువేందు ఎన్నికపై హైకోర్టుకు దీదీ

18 Jun, 2021 08:05 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత, బీజేపీ చీఫ్‌ సువేందు అధికారికి ఝలక్‌ తగిలింది. ఆయన ఎన్నికపై అనుమానాలున్నాయంటూ సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గం. పిటిషన్‌ విచారణ చేపట్టనుంది. 

కాగా, దీదీపై సువేందు రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్‌ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్‌ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్‌ కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌ దాఖలు చేయగా, జస్టిస్‌ కౌశిక్‌ చందా నేతృత్వంలో ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కిషోర్‌ బిశ్వాస్‌ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్‌. 

కాగా,  2011 నుంచి భాబనీపూర్‌ నుంచి  ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న మమత.. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. అయినప్పటికీ భారీ స్థానాలు గెల్చుకుని టీఎంసీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసింది.

చదవండి: సువేందుపై చోరీ కేసు

మరిన్ని వార్తలు