మధ్యవర్తులదే హవా.. నెల రోజుల్లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌.. | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  కొందరి పెత్తనం

Published Fri, Jun 18 2021 8:12 AM

Big Scam In Sub Registar Office In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెండ్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు పడింది. లక్సెట్టిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌ ఇక్బాల్‌ సెలవుల్లో ఉండగా ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా రతన్‌ విధుల్లో చేరారు. ఈయన గత నెల 11న రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. ఒకే రోజు 39 రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. రియల్టర్లకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేశారని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆఫీసు ముందు నిరసనలు వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆయనను సస్పెండ్‌ చేశారు. జూన్‌ 15న మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ అప్పారావు సైతం సస్పెండ్‌ అయ్యారు. ఈయన క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అమర్‌వాది శివారులోని సర్వే నంబర్‌ 3లో 847గజాల ప్లాట్‌లో లే అవుట్‌ లేకుండానే మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్లు చేశారనే ఫిర్యాదుతో సస్పెండ్‌ అయ్యారు. 

‘పాత పద్ధతి’తో సాగని రియల్‌ వ్యాపారం
జిల్లాలో బొగ్గు గనులు, అనుబంధ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు పుష్కలమైన అవకాశాలు ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులకు అనుకుని ఉన్న గ్రామాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం జిల్లా ఆవిర్భావం కంటే ముందు నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతోంది. దీంతో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనేక అక్రమాలకు తెరలేపారు. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తమ ఆధిపత్యం నడిపించారు. జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ, లావుణి, నాలా అనుమతి లేకుండానే అడ్డగోలుగా అక్రమంగా వెంచర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించారు. మున్సిపల్, రెవెన్యూ, నాలా, డీటీసీపీ అనుమతులు పొందకుండానే పెద్ద ఎత్తున ప్లాట్లు చేతులు మారాయి. మంచిర్యాలతోపాటు గద్దెరాగడి, తిమ్మాపూర్, మందమర్రి, నస్పూర్, హాజీపూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, జైపూర్‌తోపాటు అనేక ప్రాంతాల్లో లే అవుట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు సాగాయి.

ప్రభుత్వం గత అక్టోబర్‌ నుంచి వ్యవసాయ భూములకు ధరణి పోర్టల్‌లో ఎమ్మార్వో కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయేతర భూములకు మాత్రమే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు బ్రేక్‌ పడింది. దీంతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనతో సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ప్లాట్‌ కొనలేక, అమ్మలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం డాక్యుమెంట్‌టు డాక్యుమెంట్‌ మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. అంటే కొత్త ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదు.

గతంలో రిజిస్ట్రేషన్లు చేసిన ప్లాట్లకు మాత్రమే చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో అన్ని అనుమతులు, లే అవుట్‌ అనుమతి ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రియల్‌ లావాదేవీలకు దెబ్బ పడింది. గతంలోనే జిల్లాలో లే అవుట్‌ లేని ప్లాట్లు అనేకంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర జిల్లాల్లో పాత పద్ధతిలోనే చేస్తున్నారని ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఇక్కడి రియల్‌వ్యాపారులు పలుమార్లు కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ కేవలం పాత డాక్యుమెంట్లకే రిజిస్ట్రేషన్లు చేశారు. లక్సెట్టిపేటలో రియల్‌ వ్యాపారులకు తలొగ్గి రాత్రికి రాత్రే అధిక రిజిస్ట్రేషన్లు చేయడం, మంచిర్యాల పరిధిలో తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేయడం లేదనే కారణంతో ఓ పథకం ప్రకారం సస్పెండ్‌ చేయించినట్లు అనుమానాలు ఉన్నాయి. 

అక్కడంతా వారిదే రాజ్యం.. 
జిల్లాలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మధ్యవర్తులు, రియల్‌ దళారులు, అనధికార వ్యక్తుల హవానే నడుస్తోంది. భూమి, స్థిర ఆస్తి, సంస్థలు, వివాహ, సొసైటీలు తదితర రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో వచ్చినప్పటికీ మధ్యవర్తుల హవా తగ్గడం లేదు. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లు సాగుతున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇదంతా తెలిసినా నోరు మెదపరు. ప్రస్తుతం లే అవుట్‌ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో చాలావరకు రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కరోనాకు ముందు, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు మంచిర్యాలలో రోజుకు 80వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 50నుంచి 60వరకు జరుగుతున్నాయి. లక్సెట్టిపేట పరిధిలో రోజుకు రెండు మాత్రమే అవుతున్నాయి. దీంతో చాలామంది ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి.  

చదవండి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్‌ లీక్‌ 

Advertisement
Advertisement