చిన్నారుల డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్‌

29 Apr, 2022 06:21 IST|Sakshi

దిస్పూర్‌: ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. గడిచిన 8 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు మెరుగుపడినట్లు ఆయన తెలిపారు. 

అస్సాంలోని దింఫలో గురువారం జరిగిన ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలుతో ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు 75% తగ్గుముఖం పట్టాయని ప్రధాని అన్నారు. వివిధ సాయుధ గ్రూపులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని త్రిపుర, మేఘాలయాల్లో ఏఎఫ్‌ఎస్‌పీను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం నాగాలాండ్, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయని వెల్లడించారు. కర్బి ఆంగ్‌లాంగ్, ఇతర గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని ప్రధాని తెలిపారు. 

దీంతోపాటు, ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామన్నారు. అస్సాం, మేఘాలయ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని, అభివృద్ధి బాటన పయనించేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కర్బిఆంగ్‌లాంగ్‌లో వెటరినరీ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కళాశాల, మోడల్‌ కాలేజీ నిర్మాణం తదితర రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.   

మరిన్ని వార్తలు