పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 2022.. ఉభయ సభలు రేపటికి వాయిదా

18 Jul, 2022 14:30 IST|Sakshi

Parliament Monsoon Session 2022 LIVE అప్‌డేట్స్‌

పార్లమెంటు ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు చైర్మన్‌ వెంకయ్యనాయుడు.

► జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జయద్‌ అల్‌ నహన్‌ మృతి నేపథ్యంలో భారత పార్లమెంట్‌ నివాళి అర్పించింది.

► పార్లమెంట్‌ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరుగుతున్నందునా..  మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్‌ ఓం బిర్లా.

► పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్‌ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది.

► కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ కార్యక్రమం జరిగింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 2022 ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి.

► పార్లమెంట్‌ సమావేశాలు: ఓపెన్‌ మైండ్‌తో చర్చించాలి
ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం. ఆగస్ట్ 15 & రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది - దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది. పార్లమెంట్‌లో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలి, అవసరమైతే చర్చ జరగాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో, కొత్త రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు

రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు
రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అగ్నిపథ్‌ పథకంపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రూల్‌ 297 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్‌, సీపీఎం ఎంపీలు. 

► పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానున్నాయి.

► సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్‌లో తప్పనిసరిగా చర్చించాలంటున్నారు.

14 రోజుల్లో 32 బిల్లులా?   
అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గే చెప్పారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని, కేవలం 14 రోజుల్లో వాటిపై చర్చించి, ఆమోదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులూ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వీటిపై ఇప్పటికే పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలు చర్చించాయన్నారు. సభల్లో ప్రజాస్వామ్య యుతంగా వీటిపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి  
అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై వివాదం అవసరం లేదని బిజూ జనతాదళ్‌ సీనియర్‌ నేత పినాకీ మిశ్రా చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలన్నారు. ఒడిశాకు శాసన మండలిని ప్రకటించాలని విన్నవించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఏఐఏడీఎంకే నాయకుడు ఎం.తంబిదురై పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్‌ చొరవ తీసుకోవాలని తంబిదురైతోపాటు డీఎంకే నేత టీఆర్‌ బాలు కోరారు.  

అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం 
అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ నిబంధనలు, ప్రక్రియ ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని తప్పుపట్టారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్‌.జైశంకర్‌ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు