పాపం: తల్లీ, పిల్ల చిరుతల మృతి 

23 May, 2021 14:08 IST|Sakshi

సాక్షి, మైసూరు: మూడు చిరుత పులులు అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన బెళవాడి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వీటిలో ఒకటి 4–5 ఏళ్ల ఆడ చిరుత కాగా, మిగిలిన రెండు 8–10 నెలల మధ్య ఉన్న చిన్నపిల్లలు కావడం గమనార్హం. దీనిని బట్టి తల్లి, పిల్ల చిరుతలుగా భావిస్తున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కళేబరాలను సైన్స్‌ లేబోరేటరీకి తరలించారు.

మరోవైపు మూడు చిరుతలు మరణించిన కొద్ది దూరంలోనే సగం తినేసి వదిలేసి కుక్క కళేబరం ఒకటి కనిపించింది. ఆ మృత కుక్క దేహంపై కీటక నాశని పిచికారీ చేసినట్లు కనిపించింది. ఎవరో కావాలనే కుక్క కళేబరంలోకి పురుగుల మందు కలిపి చిరుతలకు ఎరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చిరుతల శరీర, రక్త నమూనాలను బెంగళూరు, మైసూరు ప్రయోగశాలలకు పంపించారు. నివేదిక అందిన తర్వాతే అసలు విషయం బయటకు రానుంది.  

చదవండి: 
ఎస్సై అమానుషం.. దళితునితో మూత్రం తాగించి..
దారుణం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు