విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి 

5 Sep, 2022 08:47 IST|Sakshi
బాలమణిగండన్, హంతకురాలు సహాయ రాణి విక్టోరియా (ఫైల్‌) 

సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో  8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్‌పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే.

ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది.  

సరైన చికిత్స అందలేదా..? 
పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్‌ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది.

అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

>
మరిన్ని వార్తలు