నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ!

31 May, 2023 07:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ కేసులో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్(హైదరాబాద్‌), మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడి విచారణ ముగిసింది. ఈ మేరకు రెండు గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ని ప‍్రశ‍్నించారు. ఈ కేసులో అంజన్ కుమార్‌కు నోటీసులు జారీ చేయడంతో.. నేడు ఆయన ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. 

ఈడీ కక్ష్య పూరిత చర్య..

కాంగ్రెస్ నాయకులపై ఈడీ  కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అంజన్ కుమార్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు రూ.20 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఈడీ ముందు ఒప్పుకున్నానని చెప్పారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. తమలాంటి వారిని లక్ష‍్యంగా చేసుకుని ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు.

గతేడాది నవంబర్‌లో విచారణకు హాజరైన సందర్భంగా అంజన్‌ కుమార్‌ను ఈడీ మూడు గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సూచన మేరకే యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చానని అంజన్‌ కుమార్‌ గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే.  

ఆ టైంలో దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్‌ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం గమనార్హం. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు