Hate Speech: విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్‌ ట్వీట్‌.. ఎన్‌టీకే నేత సీమన్‌పై కేసు

12 Mar, 2023 18:31 IST|Sakshi

చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్‌టీకే) నేత సెంథామిళన్ సీమన్‌పై తమిళనాడు ఈరోడ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. 

ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్‌ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్‌పై కేసు నమోదు చేశారు.

కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు.
చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్‌ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు..

మరిన్ని వార్తలు