దేవుడా! ఈ మృతదేహాల్లో నా కొడుకు ఉండకూడదు.. ఓ తండ్రి ఆవేదన ఇది

3 Jun, 2023 19:26 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. ఈ ప్ర‌మాదం కారణంగా ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించగా, 900 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు పడి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి త‌న కొడుకు బ‌తికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృత‌దేహాల్లో వెతుకుతూ.. దేవుడా ఇందులో నా కొడుకు ఉండకూడదూ అని లోపల అనుకుంటూ వెతుక్కుంటూ క‌నిపించాడు.

కుప్పల్లా మృతదేహాలు..
ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే వినిపిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్నాడు. తీరా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి..ఎవ‌రి కోసం వెతుకుతున్నారు అని అడ‌గ్గా.. నా కొడుకు. ఇదే కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్ర‌యాణించాడు. బ‌తికే ఉన్నాడో లేడో తెలీదు. బ‌తికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది, తనకు ఏమైందో తెలియడం లేదు. ఒకవేళ చనిపోయాడేమో అని ఇక్కడ వెతుక్కుంటున్నాను. కానీ దొర‌కడంలేదు అంటూ క‌న్నీరుమున్నీర‌య్యారు.

కాగా ..శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 7 గంటలకు జరిగిన విధ్వంసకర సంఘటనలో, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద 12841 షాలిమార్-కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంయుక్త తనిఖీ నివేదిక ప్రకారం, ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ వైఫల్యంగా అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు