వ్యవసాయ బిల్లుల ఆమోదం : రాష్ట్రపతికి విపక్ష నేతల వినతి

21 Sep, 2020 16:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయరాదని విపక్ష నేతలు రాష్ట్రపతికి సోమవారం విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరాయి. వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి ఎదురయ్యే నష్టాన్ని వివరించేందుకు తమకు సమయం కేటాయించాలని 12 రాజకీయ పార్టీలు రాష్ట్రపతిని కోరాయని కాంగ్రెస్‌ ఎంపీ శక్తిసింగ్‌ గోహిల్‌ తెలిపారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులను అంతకుముందు లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఇక వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని, ఇది సేద్య చరిత్రలో చారిత్రక ఘట్టమని, దళారీ వ్యవస్థకు ముగింపు పలకవచ్చని పాలక బీజేపీ పేర్కొంటుండగా, రైతాంగాన్ని కార్పొరేట్‌లకు బానిసలుగా మార్చేస్తున్నారని విపక్షం మండిపడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఘటనలో ఎనిమిది మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్‌ వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసి తమ గొంతు నొక్కలేరని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్ఫన్‌ దురదృష్టకరమని, ఇది ప్రభుత్వ మనోభావాలకు అద్దం పడుతోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సస్పెండ్‌ అయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. చదవండి : వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు

>
మరిన్ని వార్తలు