కాంగ్రెస్‌కు ‘కౌన్సిల్‌’ కష్టాలు

5 Dec, 2023 02:43 IST|Sakshi

ప్రస్తుతం ఆ పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలు 

కసిరెడ్డి అసెంబ్లీకి ఎన్నిక కావడంతో రెండుకు తగ్గనున్న బలం 

త్వరలో మూడు స్థానాలు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం

బిల్లుల ఆమోదానికి బీఆర్‌ఎస్‌పైనే భారం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ శాసన మండలిలో మాత్రం విచిత్రమైన స్థితిని ఎదుర్కోనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో 37 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు కాగా కేవలం ముగ్గురు (బీఆర్‌ఎస్‌ను వీడిన ఇద్దరితో కలిపి) మాత్రమే కాంగ్రెస్‌ సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మూడు ఖాళీలు మాత్రమే స్వల్ప సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. 2025 మార్చి లోపు ఏ కోటాలోనూ రిటైర్‌ అయ్యే సభ్యులు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్‌ తరఫున పెద్ద సంఖ్యలో సభ్యులు మండలిలో అడుగు పెట్టేందుకు ఏడాదిన్నర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

స్థానిక సంస్థల కోటాలో 14 స్థానాలు ఉండగా 2028లో 18 మంది రిటైర్‌ అవుతారు. ప్రస్తుతం మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ సహా ఎక్కువమంది బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉండటంతో శాసనస భ ఆమోదించే తీర్మానాలు, బిల్లులు మండలిలో నెగ్గడం బీఆర్‌ఎస్‌పైనే ఆధారపడి ఉంటుంది. 

ముగ్గురు తోడయ్యే చాన్స్‌ 
శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఈ ఏడాది ఆగస్టులో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను కేసీఆర్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నారనే కారణంతో గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో ఈ రెండు ఖాళీల్లో ఇద్దరిని గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది.

ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌) కాంగ్రెస్‌ టికెట్‌ కోసం బీఆర్‌ఎస్‌ను వీడారు. కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మండలిలో జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ సభ్యులుగా కొనసాగనున్నారు.

మరోవైపు కసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్‌ ఘనపూర్‌) కూడా ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికవడంతో మండలిలో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. వీరిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానంలో కొత్తగా వచ్చే వారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మండలిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావడంతో కాంగ్రెస్‌కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం పార్టీ ఎంపిక చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గవర్నర్‌ కోటాలో ఇద్దరు, ఎమ్మెల్యే కోటాలో ఒకరే కాంగ్రెస్‌ తరఫున మండలికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. 

బీఆర్‌ఎస్‌ తరహాలో వలసలు? 
తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని మండలిలో బలోపేతమైంది. ఇప్పుడదే తరహా వ్యూహాన్ని కాంగ్రెస్‌ కూడా అనుసరిస్తుందా? అన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. 

>
మరిన్ని వార్తలు