Orissa Chief Justice: మై లార్డ్‌, యువరానర్‌ అనాల్సిన అవసరం లేదు.. సర్‌ చాలు! 

4 Jan, 2022 21:13 IST|Sakshi

 హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ 

సాక్షి, భువనేశ్వర్‌/కటక్‌: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్‌’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్‌ లార్డ్‌షిప్, యువర్‌ ఆనర్‌ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ ఎస్‌.మురళీధర్‌ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్‌ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

ఆ తర్వాత 2020లో పంజాబ్‌–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్‌–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్‌ జస్టిస్‌ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్‌షిప్, యువర్‌ ఆనర్, ఆనరబుల్‌ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. 
చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్‌?

చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయం అభినందనీయం.. 
హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్‌ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్‌ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్‌ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్‌ అని సంబోధించాలని ఫుల్‌ బెంచ్‌ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు