తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ

25 Nov, 2023 13:37 IST|Sakshi

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ను నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశంలో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానంలో పర్యటించారు. స్వదేశీ తయారీ సామర్థ్యం పట్ల నమ్మకం కలిగిందని చెప్పారు. హాల్‌లో తయారీ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. తేజస్‌లో విహరించిన ఫొటోలను ప్రధాని అధికారిక ఖాతా నుంచి పంచుకున్నారు. 

"తేజస్‌పై ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మన స్వదేశీ సామర్థ్యంపై విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. మన జాతీయ సామర్థ్యంపై కొత్త ఆశావాదాన్ని పెంపొందించింది." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా Mk-II-Tejas యుద్ధ విమాన ఇంజన్‌లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి అమెరికా రక్షణ దిగ్గజం జీఈ ఏరోస్పేస్.. హాల్‌తో  ఒప్పందం కూడా కుదుర్చుకుంది.  

2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశానికి అపురూపమైన విజయమని ఆయన అన్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: No Non Veg Day In UP: యూపీలో నేడు 'నో నాన్‌ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన

మరిన్ని వార్తలు