శుభవార్త : ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్‌ ఖర్చు భారీగా తగ్గనుంది

25 Nov, 2023 12:42 IST|Sakshi

భారత్‌ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. 

ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు  రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. 

మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.

విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను  సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.  

ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి
ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్‌తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్‌తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్‌కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్‌ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్‌ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 

10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు 
మన దేశంలో..  అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
  
జన్‌ ఔషద కేంద్రాల్లో మెడిసన్‌ 
ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్‌ఎన్‌ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్‌  ఫార్మాస్యూటికల్స్‌లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్‌కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు.

స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్‌ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్‌ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు