ఎస్సీ వర్గీకరణపై కమిటీ

25 Nov, 2023 03:02 IST|Sakshi

కేబినెట్‌ సెక్రెటరీ, ఉన్నతాధికారులకు మోదీ ఆదేశం

ఎస్సీ వర్గీకరణపై విశ్వరూప మహాసభలో ప్రధాని హామీ

నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో కమిటీ పర్యటన

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. శుక్రవారం కేబినెట్‌ సెక్రెటరీ రాజీవ్‌ గౌబా, ఇతర సీనియర్‌ అధికారులతో ఈ మేరకు ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. 

ఇటీవల హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వరూప మహాసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు, మాదిగల సాధికారతకు సాధ్యమైన మార్గాలపై కేంద్రం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మారీ్పఎస్‌ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మందకృష్ణ చేస్తున్న ప్రతి పోరాటానికీ బీజేపీ మద్దతుగా నిలించిందని ఆయన పేర్కొన్నారు. 

‘‘మీది న్యాయ పోరాటం. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే మాదిగ ఉప కులాల కోరిక అత్యంత న్యాయమైనది. మీకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందుకోసం వెంటనే కమిటీ వేస్తామని హమీ ఇస్తున్నా. ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన చెప్పారు. 

కాగా, నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ చర్చనీయంగా మారింది.

మరిన్ని వార్తలు