90 లక్షలు దాటిన కరోనా కేసులు

21 Nov, 2020 03:43 IST|Sakshi
ఢిల్లీలో కోవిడ్‌ మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబసభ ్యులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 45,882 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,04,365కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 584 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,162కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 84.28 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.6 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,43,794గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.92  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది.  

రాష్ట్రాలకు అత్యున్నత స్థాయి బృందాలు
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పలు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అత్యున్నత స్థాయి బృందాలు వెళ్లి సమీక్షించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం చెప్పింది. ఇప్పటికే హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మణిపూర్‌లలోని కొన్ని జిల్లాలకు ఈ బృందాలు వెళ్లాయని చెప్పింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బృందాలు వెళ్లనున్నాయని పేర్కొంది. ఈ బృందాలు కంటెయిన్‌మెంట్‌ జోన్లను బలోపేతం చేయడం, సమీక్షించడం, పరీక్షలు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ వంటివాటిపై సలహాలు, సూచనలు ఇస్తాయని తెలిపింది.  

అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల (నవంబర్‌ 20–23) వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పష్టం చేశారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి ఉండబోదన్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.  

‘టీకా’పై ప్రధాని సమీక్ష
భారత్‌లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. టీకా పంపిణీ ప్రక్రియలో భాగస్వామ్యులను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్యతాక్రమం మొదలైన అంశాలపై సమీక్ష జరిపారు. వ్యాక్సీన్‌ అభివృద్ధితో పాటు సేకరణ, నియంత్రణ, నిల్వ మొదలైన ముఖ్యమైన అంశాలను సమావేశంలో చర్చించినట్లు ప్రధాని మోదీ ఆ తరువాత ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు