'సహాయం చేయడమే మా కర్తవ్యం': మోదీ

20 Feb, 2023 21:23 IST|Sakshi

తుర్కియే, సిరియాలో ఫిబ్రవరి 6న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారత బలగాలు భూకంప ప్రభావిత దేశానికి సహాయా సహకారాలు అందించేందుకు సమయాత్తమయ్యాయి. అందులో భాగంగా ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో మొత్తం మూడు ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు ఫిబ్రవరి 7న ప్రభావిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. అంతేగాదు భూకంప బాధిత ప్రజలకు విస్తృతమైన సేవలందించడానికి భారత సైన్యం, వైద్య బృందం భారీ సంఖ్యలో మోహరించి సహాయ సహకారాలు అందించింది.

ఈ క్రమంలో టర్కీ నుంచి తిరిగి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి మోదీ మీరు మానవాళికి గొప్ప సేవ చేశారని, అలాగే భారతదేశాన్ని గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌ వేదికగా...మేము ప్రంపంచాన్ని కుటుంబంగా పరిగణిస్తాం. సంక్షోభంలో ఉన్న ఏ సభ్యునికైనా.. త్వరగా సహాయం చేయడం మా కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం గత కొన్నేళ్లుగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసిందని, ఇది నిస్వార్థంగా ఇతర దేశాలకు సహాయం చేస్తోంది. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా.. మొదట స్పందించేందకు భారత్‌ ఎప్పుడూ సదా సిద్దంగానే ఉంటుంది.

అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ రిలీఫ్‌ అండ్‌ రెస్క్యూ టీమ్‌గా మన గుర్తింపును పటిష్టం చేసుకోవాలి. అలాగే విపత్తు ప్రతిస్పందన సహాయక చర్యల్లో మన బలగాల కృషి అభినందనీయమని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా అంతకు ముందురోజే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విట్టర్‌లో...టర్కీలో ఆపరేషన్‌ దోస్త్‌  కింద మోహరించిన భారత సైన్యం, వైద్య బృందం భారత్‌లోకి తిరిగి వచ్చింది. సుమారు 151 ఎన్డీఆర్‌ఎప్‌ సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌లతో కూడిన మూడు బృందాలు భూకంప ప్రభావిత టర్కీయేకు సహాయం అందించాయి. అని పేర్కొన్నారు.

(చదవండి: పెళ్లికి ముందు రోజే వధువు కాలికి ఆపరేషన్‌.. ఆస్పత్రి వార్డులో తాళికట్టిన వరుడు)

మరిన్ని వార్తలు