41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ

29 Nov, 2023 15:31 IST|Sakshi

ఢిల్లీ: సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు.  

సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్‌ వాక్‌తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్‌ వాక్‌ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు.

సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్‌ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు.  

మోదీ భావోద్వేగం..
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్‌క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. 

మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. 

నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్‌క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్‌ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్‌లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..


 

మరిన్ని వార్తలు