Who Is Gabbar Singh Negi: సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?

29 Nov, 2023 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్‌ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. 

విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు.

చివరగా నేనే..
సొరంగంలో ఉండగా గబ్బర్‌ సింగ్‌ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్‌ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్‌ సింగ్‌ నేగి చెప్పినట్లుగా జయల్‌ సింగ్‌ నేగి పేర్కొన్నారు.

సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్‌ సింగ్‌ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్‌లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు.

 

ప్రధాని ప్రశంసలు
గబ్బర్‌ సింగ్‌ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్‌ సింగ్‌ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు.

మరిన్ని వార్తలు