సీఎంలతో సోమవారం ప్రధాని భేటీ

9 Jan, 2021 04:05 IST|Sakshi

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధం

సాధ్యమైనంత త్వరలో ప్రాధాన్యతా క్రమంలో టీకా అందుబాటులోకి

న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. రెండు కోవిడ్‌ వ్యాక్సిన్‌లను ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన తరువాత ముఖ్యమంత్రులతో ఇదే ప్రధాని తొలిసమావేశం. ప్రధాని అప్పుడప్పుడు ముఖ్యమంత్రులతో కోవిడ్‌ సంక్షోభం గురించి మాట్లాడుతున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తోన్న కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించడంతో దేశవ్యాప్తంగా భారీ టీకా కార్యక్రమానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు.  

నెగెటివ్‌ వచ్చినా క్వారంటైన్‌ తప్పదు
యూకే నుంచి ఢిల్లీ చేరనున్న వారికి ప్రభుత్వం తప్పనిసరి క్వారంటైన్‌ విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. యూకేలో కొత్త స్ట్రెయిన్‌ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేవారికి చేసే కోవిడ్‌–19 పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌ ఉండాల్సిందేనని చెప్పారు. అనంతరం మరో వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని,  ఈ కొత్త నియమాలు 14 వరకు ట్రయల్‌ రూపంలో జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.

అందరికీ కరోనా టీకా
న్యూఢిల్లీ/చెన్నై:  కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ సెకండ్‌ డ్రై రన్‌ శుక్రవారం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ చెప్పారు. కరోనా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ టీకా అందుతుందని వెల్లడించారు. తొలుత ప్రాధాన్యతా వర్గాలకు టీకా అందజేస్తామన్నారు. ఆయన చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా టీకా డ్రై రన్‌ను పరిశీలించారు. వ్యాక్సిన్‌  లబ్ధిదారుల వివరాలను సేకరించడానికి కోవిడ్‌–19 వేదికను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వారికి ఎలక్ట్రానిక్‌ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని అన్నారు.  తమిళనాడు చెంగల్పట్టులో ఉన్న హెచ్‌బీఎల్‌ ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌లో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు