ప్రధాని ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌

4 Sep, 2020 03:12 IST|Sakshi

క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని మెసేజ్‌లు

ధ్రువీకరించిన ట్విట్టర్, అకౌంట్‌ పునరుద్ధరణ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్‌ ఖాతా గురువారం హ్యాకయింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలంటూ మోదీ అకౌంట్‌ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్‌ చేశారు.

ఆ తర్వాత ప్రధాని ఖాతా నుంచి ‘‘ఈ అకౌంట్‌ని జాన్‌ విక్‌ హ్యాక్‌ చేసింది. అయితే పేటీఎం మాల్‌ని మాత్రం మేము హ్యాక్‌ చెయ్యలేదు’’అని సైబర్‌ నేరగాళ్లు మరో మెసేజ్‌ పంపారు. గత నెల 30న పేటీఎం డేటా తస్కరణ జాన్‌ విక్‌ పనేనంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము ఆ పని చెయ్యలేదని నిరూపించడానికి ప్రధాని ఖాతాను హ్యాక్‌ చేసినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్‌ సంస్థ రంగంలోకి దిగి ఆ మెసేజ్‌లు తొలగించింది. ప్రధాని ఖాతాను పునరుద్ధరించి అన్ని రకాలుగా భద్రతను కల్పించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది.

మిగిలిన అకౌంట్లు భద్రం
ప్రధాని ట్విటర్‌ ఖాతా హ్యాకయిందని తెలిసిన వెంటనే అన్ని చర్యలు చేపట్టామని, ఆయన మిగిలిన ఖాతాలకు వచ్చిన ముప్పేమీ లేదని ట్విట్టర్‌ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. @narendramodi_in అని ఉండే ఈ అకౌంట్‌కి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 37 వేల ట్వీట్లు చేశారు. ఆగస్టు 31న మన్‌కీ బాత్‌ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్‌ ఆఖరిగా ట్వీట్‌ చేశారు. మోదీ ప్రసంగాలకు సంబంధించిన సమాచారం అంతా ఈ ఖాతా నుంచే ట్వీట్లు చేస్తారు. అయితే 6.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన మరో ఖాతాకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గత జూలైలో బరాక్‌ ఒబామా, జో బైడెన్, బిల్‌ గేట్స్‌ వంటి ప్రముఖుల ఖాతాలు  కూడా హ్యాక్‌ అవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా