రాష్ట్రపతి ఎన్నికలు: తెరపైకి శరద్‌ పవార్‌

14 Jun, 2022 07:35 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పవార్‌ అభ్యర్థిత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆపార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ముంబైలో శరద్‌పవార్‌తో భేటీ అయి, వెల్లడించినట్లు సమాచారం.

అయితే, పవార్‌ నుంచి గానీ, ఎన్‌సీపీ నుంచి గానీ ఈ విషయమై ఎటువంటి స్పందన రాలేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎంతోనూ ఖర్గే ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తరఫున ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ కూడా ఇదే విషయమై శరద్‌ పవార్‌తో ముంబైలో సమావేశమయ్యారు. దేశంలో అత్యంత సీనియర్‌ రాజకీయ నేతల్లో ఒకరైన పవార్, పలు సందర్భాల్లో కూటముల ఏర్పాటుతోపాటు ప్రభుత్వాలను గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం, మహారాష్ట్రలో కొనసాగుతున్న మూడు భిన్న సిద్ధాంతాలు కలిగిన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం ఆయన చొరవ ఫలితమే. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను బీజేపీ అధిష్టానం..ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు అప్పగించింది. వారిద్దరూ ఎన్‌డీఏ పక్షాలతోపాటు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదరకుంటే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఎలక్టోరల్‌ కాలేజీలోని మొత్తం 10,86,431 ఓట్లకు గాను 50%ఓట్లు సాధించిన వారే రాష్ట్రపతి అవుతారు. మెజారిటీ మార్కును దాటేందుకు బీజేపీకి మరో 13వేల ఓట్ల అవసరముంది. 

మరిన్ని వార్తలు