తాను ఊపిరొదిలి, ఇతరులకు ప్రాణభిక్ష

23 Sep, 2022 08:14 IST|Sakshi
అదర్శమూర్తి రక్షిత (ఫైల్‌) హెలికాప్టర్‌లో అవయవాలను తరలిస్తున్న దృశ్యం

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సోమనహళ్లి తండాకు చెందిన రక్షిత (17) బ్రెయిన్‌డెడ్‌ కాగా, ఆమె అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, శ్వాసకోశం, కిడ్నీలు, మూత్రకోశ, కళ్లు తదితర 9 అవయవాలను సేకరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. గుండెను 9 ఏళ్లు బాలునికి అమర్చారు. తద్వారా ఆమె ఊపిరి వదులుతూ పలువురికి ప్రాణం నిలిపింది.  

విద్యార్థుల కన్నీటి నివాళి  
శ్వాసకోశాన్ని చెన్నైకి తరలించగా, మూత్రపిండాలను మంగళూరుకు పంపారు. కళ్లను చిక్కమగళూరు ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఆమె నుంచి సేకరించిన 9 అవయవాలను 9 మందికి అమర్చవచ్చని వైద్యులు తెలిపారు. ఆదివారం బస్సు దిగుతూ కింద పడిన రక్షిత బ్రెయిన్‌ డెడ్‌ కావడం తెలిసిందే. 

గురువారం ఉదయం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు ఆమె దేహం నుంచి అవయవాలను సేకరించి భద్రపరిచారు. తరువాత రక్షిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం బసవనహళ్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి తీసుకెళ్లి విద్యార్థుల అంతిమ దర్శనం కోసం ఉంచారు. విద్యార్థులు, బోధన సిబ్బంది రక్షితకు కన్నీటి నివాళులు అర్పించారు. రక్షిత తల్లిదండ్రుల మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిస్వార్థంగా అవయవదానం చేసి పలు కుటుంబాలకు సాయం చేశారని సోషల్‌ మీడియాలోనూ అభినందనలు వెల్లువెత్తాయి.  

(చదవండి: రూ. 35 కోట్లు విలువ చేసే విగ్రహం..అమెరికాలో ప్రత్యక్షం)

మరిన్ని వార్తలు