Punjab: పంజాబ్‌ కేబినెట్‌లో ఏడు కొత్త ముఖాలు

27 Sep, 2021 08:08 IST|Sakshi

15 మందితో మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం చన్నీ 

అమరీందర్‌ మద్దతుదారులు ఐదుగురికి మొండిచేయి

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ తొలిసారిగా ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 15 మందిని కేబినెట్‌లో చేర్చుకున్నారు. వీరిలో ఏడుగురు కొత్త మంత్రులు ఉన్నారు. మంత్రులతో పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఐదు నెలల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చన్నీ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకం పాటించినట్లు స్పష్టమవుతోంది.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి మరోసారి అవకాశం కల్పించారు. బ్రహ్మ మోహింద్రా, మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్, త్రిప్త్‌ రాజీందర్‌సింగ్‌ బాజ్వా, అరుణా చౌదరీ, సుఖ్‌బీందర్‌ సింగ్‌ సర్కారియా, రజియా సుల్తానా, విజయిందర్‌ సింగ్, భరత్‌ భూషణ్‌ అషూ, రాణా గుర్జీత్‌ సింగ్‌ తదితరులు మరోసారి మంత్రులయ్యారు. అమరీందర్‌సింగ్‌కు గట్టి మద్దతుదారులుగా పేరున్న రాణా గుర్మిత్‌ సింగ్‌ సోదీ, సాధు సింగ్‌ ధరంసోత్, బల్బీర్‌సింగ్‌ సిద్దూ, గురుప్రీత్‌సింగ్‌ కంగర్, సుందర్‌శామ్‌ అరోరాకు ఈసారి నిరాశే ఎదురయ్యింది. తమను పక్కనపెట్టడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని కాంగ్రెస్‌ నాయకత్వాన్ని నిలదీశారు.  ఈ ఐదుగురు అమరీందర్‌కు అత్యంత సన్నిహితులు. చదవండి:  (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్‌.. ముహుర్తం ఖరారు)

అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఇన్‌చార్జి హరీష్‌ రావత్‌ ప్రయత్నించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు కట్టబెడతామని ఊరడించారు. సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటిస్తూ మంత్రివర్గంలో యువతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, ఒ.పి.సోనీ గత సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో నిబంధనల ప్రకారం మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. తాజా విస్తరణతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 18కి చేరింది.   చదవండి: (ఎన్నికల ప్రేమకథ)

మరిన్ని వార్తలు