గగన్‌యాన్‌.. క్రూమాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టం ఆపరేషన్‌ విజయవంతం

14 May, 2023 06:28 IST|Sakshi
మహేంద్రగిరిలో గగన్‌యాన్‌ క్రూమాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టం ఆపరేషన్‌ను నిర్వహిస్తున్న దృశ్యం

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చివరి నాటికి గగన్‌యాన్‌ ప్రయోగాన్ని నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ)లో క్రూమాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిçస్టం ఆపరేషన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఇస్రో శనివారం తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. క్రూమాడ్యూల్‌ సిస్టంను 602.94 సెకన్ల పాటు మండించి పరీక్షించారు.

ఈ పరీక్ష సమయంలో క్రూమాడ్యూల్‌లోని పారామీటర్లు అన్నీ శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా పనిచేశాయి. దీంతో గగన్‌యాన్‌ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్టైంది. క్రూమాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టంలో భాగంగా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించారు. వీటిని విజయవంతంగా పరీక్షించడంతో గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గగన్‌యాన్‌ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. అయితే ముందుగా రెండు, మూడుసార్లు మానవ రహిత గగన్‌యాన్‌ ప్రయోగాన్ని నిర్వహించాకే మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో పేర్కొంది. ఇందులో భాగంగా పలు రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
 

మరిన్ని వార్తలు