అవినీతి.. అంతర్గత పోరు

6 Dec, 2023 02:07 IST|Sakshi

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణాలివే 

మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత 

అయినా 90 శాతం మందికి టికెట్లు 

17 మంది మంత్రులు, 31 మంది ఎమ్మెల్యేల ఓటమి 

పేపర్‌ లీకేజీలతో యువతలో చెడ్డ పేరు 

రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలంటే అధికార పార్టీకి ఎప్పుడూ ముచ్చెమటలే. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని పడగొట్టడం అక్కడి ప్రజలకు అలవాటు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఇది. అధికార కాంగ్రెస్‌ ఓడిపోవడంతో ఈసారీ అది కొనసాగింది. కానీ కాంగ్రెస్‌ ఓటమికి ఆనవాయితీ కంటే అంతర్గత పోరు, అవినీతిని కట్టడి చేయడంలో సీఎం గెహ్లోత్‌ వైఫల్యమే ముఖ్య కారణాలు. యువ నేత సచిన్‌ పైలట్‌కు, గెహ్లోత్‌కు మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు తూర్పు రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను బాగా దెబ్బ తీశాయి. ప్రజాకర్షక పథకాల మైలేజీని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ కొంపముంచిన సిట్టింగులు 

గత ఐదేళ్లలో రాజస్తాన్‌లో వరుసబెట్టి పలు అవినీతి కుంభకోణాలు జరిగాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీలైనన్ని నియామకాలు చేపట్టడం ద్వారా వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు గహ్లోత్‌ ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. కానీ ఆ క్రమంలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 12 సార్లు పేపర్లు లీకయ్యాయి! వాటికోసం రాత్రింబవళ్లు కష్టపడి సన్నద్ధమైన 50 లక్షల మంది యువతీ యువకులతో పాటు వారి కుటుంబాల్లో ఇది కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

దీనికి తోడు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసమ్మతి నెలకొని ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత సర్వే ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది. అయినా ఈ కీలకమైన అంశాన్ని విస్మరించి 90 శాతానికి పైగా సిట్టింగులకు గెహ్లోత్‌ మళ్లీ టికెట్లిచ్చారు. తద్వారా కోలుకోలేని పొరపాటు చేశారు. తీరా ఫలితాలొచ్చాక మంత్రుల్లో ఏకంగా 17 మంది ఓటమిపాలవగా ఎమ్మెల్యేల్లోనూ 31 మంది అదే బాట పట్టారు. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార భారమంతటినీ సమర్థంగా మోసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన పైలట్‌ను ఈసారి గెహ్లోత్‌ పూర్తిగా దూరం పెట్టడం చేటు చేసింది.

ఓట్ల తేడా స్వల్పమే! 
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ఓటమి పాలైనా బీజేపీకి పోలైన ఓట్లతో పోలిస్తే అంతరం కేవలం 2.2 శాతమే కావడం గమనార్హం. బీజేపీకి 41.7 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌ 39.5 శాతం దక్కించుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తే ఆ పార్టీ ఓటమికి ప్రధానంగా కారణమైందనేందుకు ఇది మరో నిదర్శనం. ఎందుకంటే... 

► మొత్తం 199 స్థానాలకుగాను ఏకంగా 111 చోట్ల కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ కేవలం 66 సీట్లలోనే రెండో స్థానంలో ఉంది. 

► 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన 77 స్థానాల్లో బీజేపీకి 45 దక్కగా కాంగ్రెస్‌ 22తో సరిపెట్టుకుంది. 

► 5 శాతం కంటే తక్కువ మెజారిటీ నమోదైన 66 స్థానాల్లో బీజేపీకి 34, కాంగ్రెస్‌కు 23 దక్కాయి. 

► అలాగే 10– 20 శాతం మెజారిటీ వచ్చిన 61 స్థానాల్లోనూ బీజేపీకి 37 వస్తే కాంగ్రెస్‌కు 22 వచ్చాయి. 

► మెజారిటీ 20 శాతాన్ని మించిన 19 స్థానాల్లో మాత్రం 11 బీజేపీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్‌ ఆరింటికి పరిమితమైంది. 

► అలాగే 5–10 శాతం మెజారిటీ నమోదైన 53 సీట్లలోనూ బీజేపీకి 33 దక్కితే కాంగ్రెస్‌ 18తో సరిపెట్టుకుంది. 

>
మరిన్ని వార్తలు