Rajasthan Election Results 2023: రాజస్తాన్‌ రాజెవరో?

4 Dec, 2023 05:30 IST|Sakshi

ముఖ్యమంత్రి రేసులో నలుగురు కీలక నేతలు  

రాజస్తాన్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్‌ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్‌ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్‌ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, మహంత్‌ బాలక్‌నాథ్‌ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..  

వసుంధర రాజే
వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్‌ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్‌ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి.   

దియా కుమారి
రాజ్‌సమంద్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్‌ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్‌ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం              సాగుతోంది.  

మహంత్‌ బాలక్‌నాథ్‌ యోగి
రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్‌ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్‌ బాలక్‌నాథ్‌ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్‌  యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్‌ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్‌ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్‌ చాంద్‌నాథ్‌ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

గజేంద్రసింగ్‌ షెకావత్‌
రాజస్తాన్‌ బీజేపీలో మరో సీనియర్‌ నేత గజేంద్రసింగ్‌ షెకావత్‌. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్‌ ఆశలు పెట్టుకున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

>
మరిన్ని వార్తలు