వీడియో: బుసలుకొడుతూ కాటేసిన నాగు.. నిమిషాల్లో కుప్పకూలిన ‘స్నేక్‌మ్యాన్‌’ వినోద్‌

14 Sep, 2022 07:37 IST|Sakshi

జైపూర్‌: ఆయన అనుభవం అలాంటిది ఇలాంటిది కాదు. ఏకంగా 20 ఏళ్లుగా పాములు పట్టే పని చేశారు. ఊరుకాదు.. ఏకంగా జిల్లాలో ఏ ఇంట్లో, దుకాణాల్లో పాములు దూరినా పట్టేసి అడవిలో భద్రంగా వదిలి వచ్చేవారు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. అలాంటి వ్యక్తి  చివరకు.. పాముకాటుతో విషం ఒంటికెక్కి నిమిషాల్లోనే కుప్పకూలి మరణించాడు. 

రాజస్థాన్‌ చురు జిల్లాకు చెందిన వినోద్‌ తివారీ(45)కి ‘స్నేక్‌ మ్యాన్‌’గా పేరుంది. చురు జిల్లాలో ఎక్కడై.. ఏమూల అయినా ‘పాము’ అనే పిలుపు అందుకుంటే చాలు.. వెళ్లి తన పని చేసేవాడు. ఈ క్రమంలో.. శనివారం సాయంత్రం గోగమెడి ప్రాంతంలో ఓ నాగుపామును పట్టేశాడు. అయితే దానిని పట్టే క్రమంలో అది వేలిని కాటేసింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో.. ఆయన ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ముందు పామును దూరంగా వదిలొచ్చి.. ట్రీట్‌మెంట్‌కు వెళ్లాలని భావించారు. ఓ సంచిలో దానిని వేసుకుంటూ కాస్త ముందుకు వెళ్లగానే.. అలాగే కుప్పకూలిపోయారు. స్థానికులు అది గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాటేసిన నాగులో విషం మోతాదు అధికంగా ఉండడంతో ఆయన వెంటనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను గ్రామస్తులు దగ్గరుండి నిర్వహించారు. ప్రస్తుతం వినోద్‌ పామును పట్టి గాయపడిన వీడియో ఒకటి ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు