Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్‌ బూత్‌

25 Nov, 2023 05:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న బార్మర్‌ జిల్లా పార్‌ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్‌ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది.

ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్‌ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్‌ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్‌ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు.

కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్‌గావ్‌ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు