అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌జీటీ షాక్

12 Sep, 2020 17:43 IST|Sakshi

అధిక ప్లాస్టిక్ వాడుతున్న సంస్థలనుంచే జరిమానా వసూలు చేయండి :  ఎన్‌జీటీ

సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇ-కామర్స్ సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) షాక్ ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి జరిమానాను  వసూలు చేయాలని  ఎన్‌జీటీ  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి (సీపీసీబీ) ఆదేశాలిచ్చింది. ఈ కామ‌ర్స్ సంస్థలనుంచి స‌రైన రీతిలో జ‌రిమానా వ‌సూల్ చేయ‌డం లేద‌ని ట్రిబ్యున‌ల్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ట్రిబ్యునల్ చర్య తీసుకున్ననివేదికను అక్టోబర్14లోగా సమర్పించాలని కోరింది. ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను తమ ప్యాకేజింగ్‌లో అధిక ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలంటూ ఆదిత్య దుబే య(16) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన  ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. 

ప‌ర్యావ‌ర‌ణ సూత్రాల‌ను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఆడిట్, తగిన నష్టపరిహారాన్ని వ‌సూల్ చేయాల‌ని ఎన్‌జీటీ జ‌స్టిస్ ఏకే గోయ‌ల్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం  ఆదేశించింది.  ప్యాకేజీల కోసం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మ‌ళ్లీ సేక‌రిస్తున్నారా లేదా అన్న అంశాన్ని ప‌రిశీలించాల‌ని తెలిపింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 ప్రకారం బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందని, తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ వల్ల ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీపీసీబీ ఇంతకు ముందే ఎన్‌జీటీ తెలిపింది. ప్రొవిజ‌న్ 9(2) ప్రకారం.. ప్యాకింగ్ చేసిన సంస్థలే మ‌ళ్లీ  వ్యర్థాలను సేకేరించాల‌ని  పేర్కొంది. 

కాగా సరుకుల ప్యాకేజింగులో అధికంగా ప్లాస్టిక్ వాడడాన్ని ఆపేలా అమెజాన్  ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించాలని ఆదిత్య దుబే తన లీగల్ గార్డియన్ ద్వారా ఎన్‌జిటిని అభ్యర్థించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్  ద్వారా పర్యావరణానికి తీరని నష్టం ఏర్పడుతోందన్నారు. ఇది చాలా తక్కువ శాతంలో రీసైకిల్ అవుతున్న కారణంగా భూమి ప్లాస్టిక్‌కు పెద్ద డంపింగ్ గ్రౌండ్‌గా మారుతోందన్నారు. తద్వారా ఏర్పడిన మైక్రోప్లాస్టిక్స్ భూమిని, నీటిని తీవ్రంగా కలుషితం చేస్తోందని దుబే వాదించారు.  

>
మరిన్ని వార్తలు