అందరినీ కలిపి విచారిస్తే ఎలా?.. ఈడీకి కోర్టు సూటి ప్రశ్న

16 Mar, 2023 15:28 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడగింపు సందర్భంగా ప్రత్యేక న్యాయస్థాన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అందరినీ కలిపి విచారిస్తే ఎలా? అంటూ ఈడీ తీరును ప్రశ్నించింది ధర్మాసనం.  

గురువారం పిళ్లైని కస్టడీ పొడగింపు కోసం రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరు పర్చింది ఈడీ. ఈ తరుణంలో పిళ్లైకి కస్టడీని ఈడీ విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. అయితే.. ఈడీ వాదనల సందర్భంగా జోక్యం చేసుకున్న బెంచ్‌.. ‘అందరినీ కలిపి విచారిస్తే ఎలా? కొన్ని డాక్యుమెంట్ల ద్వారా కూడా విచారణ ఉంటుంది కదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. 

అయితే.. లిక్కర్‌ స్కాం కేసులో కవిత అనుమానితురాలుగా ఉందని, కవితతో పాటు పిళ్లైని విచారించాల్సి ఉందని, అయితే.. కవిత ఇవాళ్టి విచారణకు హాజరు కాకపోవడంతో  మరోసారి విచారణకు నోటీసులు ఇచ్చామని, కాబట్టి.. పిళ్లై కస్టడీ పొడగించాలని ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది ఈడీ. దీంతో ఈడీ కస్టడీ పొడగింపునకు అనుమతిచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇవాళ విచారణకు హాజరుకాని కల్వకుంట్ల కవిత, తన న్యాయవాది ద్వారా ఈడీకి లేఖ ద్వారా బదులు పంపారు. కోర్టులో తన పిటిషన​ పెండింగ్‌లో ఉన్నందున రాలేనని, తన ప్రతినిధి ద్వారా సంబంధిత పత్రాలను(డాక్యుమెంట్లను) ఈడీకి పంపుతున్నట్లు లేఖ ద్వారా ఈడీకి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె విజ్ఞప్తికి అంగీకరించని ఈడీ.. చివరికి మరోసారి 20వ తేదీన తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది కూడా. మరోవైపు కవితతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌ రావులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు