నాన్న మిస్సింగ్‌.. తన మాజీ భార్యతో కాపురం పెట్టాడని కొడుకు షాక్‌

4 Jul, 2021 18:33 IST|Sakshi

లక్నో: నాన్న చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. కనిపించడం లేదంటూ ఆర్‌టీఐకి అప్లికేషన్‌ పెట్టుకున్నాడు ఒక కొడుకు. కాగా ఆర్‌టీఐ తన నాన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని చెప్పగానే జిల్లా పంచాయతీరాజ్‌ ఆఫీసుకు సంతోషంగా వెళ్లాడు. కానీ వారు ఇచ్చిన వివరాలు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కారణం ఆ యువకుడి నాన్న మరో యువతిని పెళ్లిచేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే  ఆ యువతి ఎవరో కాదు.. ఐదేళ్ల కిత్రం ఆ యువకుడి మాజీ భార్యే కావడం విశేషం. ఇప్పుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వింత ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 2016లో సదరు యువకుడు మైనర్‌గా ఉన్నప్పుడు ఒక మైనర్‌ అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ యువకుడు రోజు తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆరు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆ యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది. కాగా ఆ యువకుడి తండ్రి సానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. ఇటీవలే కొన్ని రోజుల నుంచి తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్‌ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు.

తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. తన మాజీ భార్యనే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకున్నాడు. వెంటనే బసౌలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు  జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. తన రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని.. అతన్ని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులు మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు.

మరిన్ని వార్తలు