ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

8 Sep, 2020 17:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన న్యాయవాది షాజీ జె కోదన్‌కందత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అకారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని పిటిషన్‌లో షాజి కోరారు.

చమురు ధరలు తగ్గినా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయనీ,  ఏప్రిల్ నుండి  వరుసగా ధరలు  పెరుగుతున్నాయని షాజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం షాజిపై ఆగ్రహం వ్యక్తం  చేసింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంలో పిల్‌ వేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం పిటిషన్‌ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ రోహింటన్ నారిమన్ హెచ్చరించారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు