‘బిల్కిస్‌ బానో’ దోషుల విడుదల.. గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

25 Aug, 2022 12:20 IST|Sakshi

ఢిల్లీ: బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పదకొండు మంది దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దోషుల విడుదలపై గురువారం గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా కాదా?. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తును ఎలా పరిగణనలోకి తీసుకున్నారో చూడాల్సి ఉందంటూ అంటూ సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వం దోషుల విడుదలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది.  

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది.

ఈ విడుదలపై బాధితురాలితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ గుజరాత్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్కిస్‌ బానో తరపున న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పదకొండు మంది విడుదలను సవాల్‌ చేస్తూ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.  

ఇదీ చదవండి: నాలుక కోస్తా.. ఎమ్మెల్యేకు వార్నింగ్‌ లెటర్‌ కలకలం

మరిన్ని వార్తలు