రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు

8 Aug, 2020 09:49 IST|Sakshi

సాక్షి, కోళీకోడ్:  కేరళ  కోళీకోడ్ విమాన ప్రమాద  దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా జరిగిన ఘోర ప్రమాదంలో  ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. ప్రమాద స్థలంలో భయంతో పిల్లల రోదనలు మిన్నంటిన దృశ్యం హృదయాల్ని కదిలించక మానవు. రక్తమోడే దుస్తులతో కకావికలమైన ప్రయాణికులు ఒకవైపు..ఏం జరిగిందో తెలియని గందరగోళంలో  తీవ్ర నొప్పితో క్షతగ్రాతుల ఆర్తనాదాలు, మరోవైపు అంబులెన్స్ సైరన్ల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ప్రమాద తీవ్రతను గమనించేలోపే ప్రయాణీకుల ప్రాణాల్లో కలిసిపోయిన వైనం బాధితుల బంధువుల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. (ఆయన ధైర్యమే కాపాడింది!)

రెండు ముక్కలై పోయిన విమాన శిథిలాల మధ్య  చిక్కుకున్నవారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్న స్థానిక సివిల్ పోలీసులతో సహా రెస్క్యూ సిబ్బంది బాధితులను బయటకు తీసేందుకు  తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.  చిన్న పిల్లలు సీట్ల క్రింద చిక్కుకుపోయిన దృశ్యం చాలా బాధ కలిగించిందని స్థానికులు చెప్పారు. భయంకరమైన శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు... కొందరికి, చేతులు కాళ్ళు విరిగిపోయాయి.. వారిని తరలిస్తున్న సమయంలో తమ చేతులు, దుస్తులు రక్తంలో తడిచిపోయాయంటూ తన భయంకర అనుభవాన్ని వివరించారు. నాలుగైదు సంవత్సరాల లోపు పిల్లలు భయంతో తమకు అతుక్కుపోయారంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అంబులెన్స్‌లు చేరుకోడానికే ముందే గాయపడిన వారిని కార్లలో వివిధ ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించామన్నారు.

కాగా ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 10 మంది  చిన్నారులతోపాటు 174 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉండగా,  ఇద్దరు పెలెట్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. షార్జా, దుబాయ్‌లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు