వైరల్‌: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ

24 Jun, 2021 11:02 IST|Sakshi

సిమ్లా: భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది, హిమాచల్ ప్రదేశ్ సీఎం భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త చివరకు పెద్దదై చేయి చేసుకునే వరకూ వెళ్లడం కలకలం రేపింది. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

వివరాల్లోకి వెళితే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు విమానాశ్రయం బయట గుమికూడారు. అయితే అక్కడ ప్రజలు గుమిగూడడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్‌ను, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంప​ దెబ్బ కొట్టాడు. ఈ సమయంలో ఎస్పీ గౌరవ్ సింగ్‌ని సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్ కాలితో తన్నారు.

కాగా, ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని అన్నారు. అలాగే  బ్రిజేష్ సూద్‌ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు.
 


చదవండి: వైరల్‌: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం

మరిన్ని వార్తలు