అందరికీ వ్యాక్సిన్‌ అందేందుకు ఐదేళ్ల సమయం

14 Sep, 2020 19:44 IST|Sakshi

సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ ఆధార్‌ పూనావాలా

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రపంచ జనాభా అంతటికీ అందించేందుకు నాలుగైదేళ్ల సమయం పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ ఆధార్‌ పూనావాలా పేర్కొన్నారు. 2024 వరకూ కరోనా వ్యాక్సిన్‌ కొరత ప్రపంచాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా మొత్తానికి సరిపోయేలా వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఫార్మా కంపెనీలు పెంచడంలేదని వాపోయారు.

దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవసరమైన కోల్డ్‌చైన్‌ మౌలిక సదుపాయాలు లేవని భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 40 కోట్లకు మించిన డోసులపై మన దగ్గర ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక లేదని, దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం మనకున్నా దాన్ని వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండరాదని ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల కార్యక్రమంగా చేపడితే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల డోసుల కోవిడ్‌-19 వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు.

కాగా, కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల తయారీకి ఆస్ర్టాజెనెకా సహా ఐదు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో సీరం ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ర్టాజెనెకా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించి 100 కోట్ల డోసులను తయారు చేసేందుకు ఎస్‌ఐఐ సంసిద్ధమైంది. వీటిలో సగం భారత్‌లో సరఫరా చేస్తారు. ఇక ఇటీవల నిలిచిపోయిన ఈ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు వైద్య నియంత్రణ మండలి అనుమతి లభించడంతో పున:ప్రారంభమయ్యాయి.

చదవండి : వచ్చే ఏడాది మొదట్లో టీకా

మరిన్ని వార్తలు