షాకింగ్‌ వీడియో: మైనర్‌ బాలికపై దారుణం.. రెండో అంతస్తు పైనుంచి

23 Jun, 2021 16:48 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అంతేగాక 17 ఏళ్ల మైనర్‌ బాలికను రెండో అంతస్తు నుంచి అత్యంత పాశవికంగా కిందకు తోసేశారు. ఈ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్ర గాయాలైన బాలికనను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మధురలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బాధితురాలి సోదరుడు దినేష్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 

బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం. కొంతమంది యువకులు ఏడాది కాలంగా మా చెల్లిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మా నాన్నకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. కొద్దిగా మాట్లేడే పని ఉందని చెప్పడంతో.. తాము మధురలో నివాస్తున్నామని నాన్న సమాధానం చెప్పాడు. కొంత సమయం తరువాత ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా ఇంట్లోకి చొరబడి.. నాపై అమ్మా, నాన్నపై దాడి చేశారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు గదిలో ఉన్న మా చెల్లిని బలవంతంగా రెండో అంతస్తు మీదకు తీసుకెళ్లి బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని వెల్లడించాడు.

ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బాలిక ఒక్కసారిగా పై నుంచి కింద పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పడిపోవడంతో స్థానికంగా ఉన్న జనాలు పరుగెత్తుకొచ్చి సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలైన బాలికను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుముక, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మధుర రూరల్‌ ఎస్పీ శిరీష్‌ చంద్ర తెలిపారు. 

మరిన్ని వార్తలు